కాంగ్రెస్ తో ఆప్ కుస్తీ
పొత్తు ఉండదన్న సీఎం
పంజాబ్ – లోక్ సభ ఎన్నికల వేళ ఇండియా కూటమికి భారీ షాక్ తగిలింది. ఓ వైపు ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రను చేపట్టారు. గురువారం అరుణాచల్ ప్రదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్ కు చేరుకోనుంది. ఈ తరుణంలో ఉన్నట్టుండి ఇండియా కూటమిలో నిన్నటి దాకా దోస్తీ చేసిన టీఎంసీ గుడ్ బై చెప్పింది.
కాంగ్రెస్ పార్టీతో తమ చర్చలు ఫలించలేదని ఆరోపించారు టీఎంసీ చీఫ్ , సీఎం మమతా బెనర్జీ. ఇదే సమయంలో తాను ప్రతిపాదించిన వాటిని ఏవీ కాంగ్రెస్ ఒప్పుకోలేదని అందుకే రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రేపటి రాహుల్ యాత్ర గురించి తనకు తెలియదన్నారు.
ఈ షాక్ నుంచి కోలుకుంటున్న ఇండియా కూటమికి మరో దెబ్బ తగిలింది. పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు అంటూ ఉండదని తేల్చి చెప్పారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్. ఈ మేరకు బుధవారం ఆయన కీలక ప్రకటన చేశారు. తమతో కలిసి వచ్చేందుకు కాంగ్రెస్ సుముఖత కనబర్చడం లేదన్నారు.
ఇదిలా ఉండగా తాజాగా సీఎం మాన్ చేసిన ఈ కీలక ప్రకటన కూటమిలో కలకలం రేపుతోంది. భగవంత్ మాన్ నిర్ణయానికి ఆప్ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం ఓకే చెప్పినట్లు సమాచారం.