కాంగ్రెస్ పై దీదీ కన్నెర్ర
సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగానే
న్యూఢిల్లీ – ప్రతిపక్షాలతో కూడిన ఇండియా కూటమికి బిగ్ షాక్ తగిలింది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ప్రస్తుతం అన్ని పార్టీలకు సమన్వయకర్తగా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలోనే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇటీవల ఢిల్లీలో జరిగిన కీలక భేటీలో మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యారు. ఈ ఇద్దరితో పాటు మరికొందరు నేతలు ఖర్గేను ఇండియా కూటమికి చీఫ్ గా ప్రతిపాదించారు. ఇందుకు ఒప్పుకున్నారు.
కానీ ఏమైందో ఏమో కానీ టీఎంసీ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కోపం వచ్చింది. ఆ వెంటనే తాము కాంగ్రెస్ తో కలిసి నడవాలని అనుకోవడం లేదంటూ ప్రకటించారు. ఆమె చేసిన తాజా ప్రకటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. బెంగాల్ లో తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకోవాలని అనుకోవడం లేదన్నారు మమతా బెనర్జీ.
తాను చేసిన ప్రతిపాదనలను కాంగ్రెస్ పార్టీ పట్టించు కోలేదన్నారు. ఆ పార్టీ తిరస్కరించిందని, అందుకే తాను ఒంటరిగానే యుద్దం చేయాలని నిర్ణయించు కున్నట్లు తెలిపారు దీదీ. ఇదే సమయంలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర గురించి తనకు తెలియదని చెప్పారు.