NEWSTELANGANA

కాంగ్రెస్ ప్ర‌భుత్వం విఫ‌లం

Share it with your family & friends

నిప్పులు చెరిగిన హ‌రీశ్ రావు

సిద్దిపేట – మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు నిప్పులు చెరిగారు. మాయ మాట‌ల‌తో ప‌వ‌ర్ లోకి వ‌చ్చిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌డంలో పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని ఆరోపించారు. హ‌రీశ్ రావు మీడియాతో మాట్లాడారు. సిద్దిపేట జిల్లా ఎర్ర‌వ‌ల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ స‌మ‌క్షంలో బీఆర్ఎస్ పార్లమెంట‌రీ స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్బంగా హ‌రీష్ రావు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

పార్ల‌మెంట్ స‌మావేశాల్లో అనుస‌రించాల్సిన విధానంపై సుదీర్ఘ చ‌ర్చ జ‌రిగింద‌న్నారు. కృష్ణా రివ‌ర్ బోర్డుకు ప్రాజెక్టులు అప్ప‌గించ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. తెలంగాణ కు దీని వ‌ల్ల తీవ్ర‌మైన అన్యాయం జ‌రుగుతుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

కేంద్రం దీనికి సంబంధించిన మినిట్స్ కూడా బ‌య‌ట పెట్టింద‌ని గుర్తు చేశారు. కృష్ణా జ‌లాల్లో మ‌న వాటా తేల‌కుండా బోర్డుకు ఎలా అప్ప‌గిస్తారంటూ ప్ర‌శ్నించారు హ‌రీశ్ రావు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను కాపాడ‌డంలో రేవంత్ రెడ్డి స‌ర్కార్ పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. గ‌తంలోనూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ‌కు అన్యాయం చేశాయంటూ ఆరోపించారు.

సిమెంట్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియాను పున‌రుద్ద‌రిస్తామ‌ని గ‌తంలో అమిత్ చంద్ర షా ఇచ్చిన హామీ ఏమైంద‌ని నిల‌దీశారు. రాష్ట్రంలో వెంట‌నే బీసీ గ‌ణ‌న చేప‌ట్టాల‌ని హ‌రీశ్ రావు డిమాండ్ చేశారు. పార్ల‌మెంట్ లో త‌మ గొంతు వినిపిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.