కూలిన వంతెన జనం ఆవేదన
సగం వరకే పూర్తయిన పనులు
ఖమ్మం జిల్లా – ఈ దేశంలో అవినీతి ఏ మేరకు ఉందో ప్రాజెక్టుల నిర్మాణాలు తేట తెల్లం చేస్తున్నాయి. నిన్న గాక మొన్న కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్స్ కుంగి పోయాయి. ఇదే సమయంలో తాజాగా ఖమ్మం జిల్లాలో నిర్మాణంలో ఉన్న వంతెన ఒక్కసారిగా కూలి పోయింది.
ఈ వంతెనను వైరా- మధిర మధ్య చేపట్టారు. ఇదిలా ఉండగా కూలి పోయే సమయానికి సగం వరకు బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తయ్యాయి. ఉన్నట్టుండి ఒక్కసారిగా వంతెన కూలి పోయింది. దీంతో పెద్ద ఎత్తున శబ్దం వచ్చింది. ఒక్కసారిగా చుట్టు పక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
ఇదే సమయంలో వాహనదారులు నానా తంటాలు పడ్డారు. ఈ వంతెన కూలిన ఘటనలో ఎనిమిది మంది కూలీలకు గాయాలైనట్లు సమాచారం. ఇదిలా ఉండగా బ్రిడ్జి నిర్మాణం పనుల్లో నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం కారణంగానే కుప్ప కూలిందని స్థానికులు మండి పడుతున్నారు. వెంటనే వంతెన నిర్మాణం కూలి పోయేందుకు కారణమైన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.