కృష్ణపట్నం పోర్టు ఎక్కడికీ పోదు
వ్యతిరేక నిర్ణయం తీసుకుంటే పోరు
అమరావతి – ఏపీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణ పట్నం పోర్టుకు సంబంధించి టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణ పట్నం పోర్టుకు సంబధించిన కంటైనర్ టెర్మినల్ ను తరలిస్తున్నారంటూ చెప్పడం మంచి పద్దతి కాదన్నారు. తమ ప్రభుత్వం ప్రజల కోసం ఉన్నదని, వారికి వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకోదని స్పష్టం చేశారు.
మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి గురువారం మీడియాతో మాట్లాడారు. ఎవరూ ఎలాంటి అనుమానాలు పడాల్సిన అవసరం లేదన్నారు. కంటైనర్ టెర్మినల్ ను తరలించే ఉద్దేశం ఏమాత్రం ప్రభుత్వానికి లేనే లేదని కుండ బద్దలు కొట్టారు.
ఎవరినీ ఉద్యోగాల నుంచి తొలగించే ప్రసక్తి లేదన్నారు కాకాణి . పోర్టు ఎక్కడికీ వెళ్లదు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం, తన ప్రాపకం పెంచు కునేందుకే సోమిరెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ పోర్టు యాజమాన్యం వ్యతిరేక నిర్ణయం తీసుకుంటే తానే ముందుండి ప్రజల తరపున, ఈ ప్రాంతం కోసం పోరాడుతానంటూ హెచ్చరించారు.