కేసీఆర్ కు మాజీ గవర్నర్ పరామర్శ
ఎలా ఉన్నావని అడిగిన నరసింహన్
హైదరాబాద్ – మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సంచలనంగా మారారు. ఆయన గతంలో ఉమ్మడి ఏపీతో పాటు విడి పోయాక కూడా గవర్నర్ గా ఉన్నారు. ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు, కేసీఆర్ మధ్య సయోధ్య కుదిర్చారు. ఆ తర్వాత కనపడకుండా పోయారు. ఉన్నట్టుండి వార్తల్లో నిలిచారు.
దీనికి కారణంగా మొదటగా తమిళనాడు నుంచి నేరుగా కొత్తగా కొలువు తీరిన సీఎం ఎనుముల రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. ఆయనను శాలువాతో సన్మానించారు. ఆపై ప్రత్యేకంగా గెలుపొందినందుకు అభినందించారు.
ఆదివారం రేవంత్ రెడ్డిని జైలు పాలు చేసిన మాజీ సీఎం కేసీఆర్ ను తన నివాసంలో కలుసుకున్నారు. ఆయనను పరామర్శించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఎర్రవల్లి లోని తన ఫామ్ హౌస్ కే పరిమితం అయిన కేసీఆర్ ఉన్నట్టుండి బాత్రూంలో జారి పడ్డారు.
దీంతో హుటా హుటిన యశోద ఆస్పత్రికి తరలించారు. అక్కడ మెరుగైన చికిత్స అందజేశారు. తిరిగి నడిచేందుకు ప్రయత్నం చేస్తున్నారు. తను ఆస్పత్రిలో ఉండగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతాన్ని మరిచి పోయి , అన్నింటిని పక్కన పెట్టి కేసీఆర్ ను కలుసుకున్నారు. మాజీ సీఎంను పరామర్శించారు.
కేసీఆర్ కు మెరుగైన చికిత్స చేయాలని ఆదేశించారు. చికిత్స అనంతరం ఫామ్ హౌస్ కు వెళ్లకుండా నంది హిల్స్ లోని తన ఇంటికి వచ్చారు కేసీఆర్. మొత్తం మీద మాజీ గవర్నర్ ఎందుకు వచ్చారనే దానిపై చర్చ జరుగుతోంది.