NEWSTELANGANA

కోటి 25 ల‌క్ష‌లకు పైగా ద‌ర‌ఖాస్తులు

Share it with your family & friends


డిసెంబ‌ర్ 28 నుంచి జ‌న‌వ‌రి 6 వ‌ర‌కు

హైద‌రాబాద్ – రాష్ట్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన ప్ర‌జా పాల‌న కార్య‌క్ర‌మానికి పెద్ద ఎత్తున ఆద‌ర‌ణ ల‌భించింది. ప్ర‌త్యేకించి ఏకంగా కోటి 25 ల‌క్ష‌ల మందికి పైగా ఆరు గ్యారెంటీల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఈ విష‌యాన్ని సోమ‌వారం ప్ర‌భుత్వం వెల్ల‌డించింది.

గ‌త డిసెంబ‌ర్ నెల 28 నుంచి ప్రారంభ‌మైన ఈ ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ ప్ర‌క్రియ జ‌న‌వ‌రి 6 వ‌ర‌కు కొన‌సాగింది. ప్ర‌జా పాల‌న‌లో మొత్తం 1, 25, 84, 383 అప్లికేష‌న్స్ వ‌చ్చిన‌ట్లు పేర్కొంది స‌ర్కార్. ఇందులో 5 గ్యారెంటీల‌కు సంబంధించి 1,05,91,636 దరఖాస్తులు రాగా, ఇతర అభ్యర్థనలకు సంబంధించి 19,92,747 ఉన్నాయి.

రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయితీలు, 3,623 మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలన సభ‌లు నిర్వ‌హించారు. ఈ గ్రామ సభల్లో 1,11,46,293 మంది , 3,714 అధికార బృందాలు పాల్గొన్నాయి. దరఖాస్తుల స్వీకరణకు 44,568 కౌంటర్లను ఏర్పాటు చేశారు.

ఈ ప్రజాపాలన సజావుగా జరిగేందుకు పది ఉమ్మడి జిల్లాలు, జీహెచ్ఎంసీలోని అయిదు జోన్లకు ఒక్కొక్క సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రత్యేక పర్యవేక్షణ అధికారులుగా ప్రభుత్వం నియమించింది. ఈ దరఖాస్తుల‌ను 17వ తేదీలోగా న‌మోదు చేయాల‌ని జిల్లాల క‌లెక్ట‌ర్ల‌ను సీఎస్ ఆదేశించారు.