కోమటిరెడ్డి ఆరోగ్యంపై ఆరా
పరామర్శించిన మంత్రి సీతక్క
హైదరాబాద్ – రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆస్పత్రి పాలయ్యారు. ప్రస్తుతం ఆయన కోలుకున్నారు. విషయం తెలుసుకున్న సహచర మంత్రి దాసరి సీతక్క ఆయన నివాసానికి వెళ్లారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆరోగ్యం ఎలా ఉందంటూ వాకబు చేశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
అంతకు ముందు తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ దీపా దాస్ మున్షీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిని పరామర్శించారు. మరో వైపు ఏఐసీసీ కూడా ఆయన ఆరోగ్యం ఎలా ఉందంటూ సీఎం రేవంత్ రెడ్డిని అడిగి తెలుసుకుంది.
తన ఆరోగ్యం గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో అలుపెరుగని రీతిలో పాల్గొనడం వల్ల కొంత ఇబ్బంది ఏర్పడిందన్నారు. ఆ వెంటనే తాను ఆస్పత్రిలో చేరానని, వైద్యులు మెరుగైన చికిత్స అందించారని తెలిపారు.
పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానుల ఆదరాభిమానాలు తనకు ఎల్లప్పుడూ ఉంటాయని వారి ఆశీస్సులు తన ఆరోగ్యాన్ని కాపాడుతాయని ఈ సందర్బంగా పేర్కొన్నారు. త్వరలోనే ప్రజల వద్దకు వస్తానని, వారి సమస్యలు వింటానని , ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసేలా చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.