గాడి తప్పిన రేవంత్ పాలన
నిప్పులు చెరిగిన రఘునందన్ రావు
హైదరాబాద్ – భారతీయ జనతా పార్టీ ఎంపీ రఘునందన్ రావు నిప్పులు చెరిగారు. శనివారం ఆయన ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. తాము ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ఎందుకు శ్రద్ద చూపడం లేదంటూ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు.
సంక్షేమ పథకాల కోసం లైన్ లో నిలబడి ఫామ్ లు నింపి ఆరు నెలలు అవుతోందని, దీనిపై కొంత మేరకైనా దృష్టి సారించక పోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ ఎంపీ. ప్రజలు కొంత కాలం వేచి చూస్తారని ఆ తర్వాత తగిన రీతిలో బుద్ది చెప్పడం ఖాయమని పేర్కొన్నారు.
ఆరు గ్యారెంటీలు ఏమైయ్యాయో ఈ ప్రభుత్వానికి తెలుసా అని ప్రశ్నించారు. పక్క పార్టీలకు చెందిన వారిని ఎలా తమ పార్టీలోకి చేర్చు కోవాలనే దానిపై ఉన్నంత ఫోకస్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై లేక పోవడం విడ్డూరంగా ఉందన్నారు రఘునందన్ రావు.
పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారిని రాళ్లతో కొట్టాలని పిలుపునిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్న దానిపై ఏమంటారంటూ నిలదీశారు ఎంపీ. ఇదేనా ప్రజా పాలన అంటే అని ఎద్దేవా చేశారు.