గిరిజన ప్రాంతాల్లో సెల్ టవర్లు షురూ
ప్రారంభించిన ఏపీ సీఎం జగన్ రెడ్డి
అమరావతి – ఏపీలోని గిరిజన ప్రాంతాలలో సెల్ ఫోన్ ఉపయోగం రానుంది. ఈ మేరకు గురువారం ఏపీ సీఎం సెల్ ఫోన్ టవర్లను ప్రారంభించారు. వర్చువల్ సమావేశం చేపట్టారు. పలువురు గిరిజన మహిళలు సీఎంతో మాట్లాడారు. తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మీరు చేయడం వల్లనే తమకు ఫోన్ మాట్లాడే సౌకర్యం వచ్చిందని అన్నారు. జగన్ మోహన్ రెడ్డిని ప్రశంసలతో ముంచెత్తారు.
గతంలో ఫోన్ సౌకర్యం లేక తీవ్రమైన ఇబ్బందులు పడ్డామని వాపోయారు. కానీ ఇప్పుడు ఆ బెంగ పోయిందన్నారు. అత్యవసరమైన పని పడినా లేదా సమాచారం ఇవ్వాలన్నా పాడేరు హెడ్ క్వార్టర్స్ దాకా వెళ్లాల్సి వచ్చేదని ఆవేదన చెందారు. కొండలు ఎక్కినా సిగ్నల్స్ వచ్చేవి కావన్నారు.
ఇవాళ నేరుగా తమ వద్దకు సెల్ టవర్స్ రావడం వల్ల ఆ ఇబ్బందుల నుంచి దూరమైనట్లు తెలిపారు. ప్రస్తుతం సిగ్నల్ కూడా వచ్చిందన్నారు. గతంలో సచివాలయం అంటే, కలెక్టర్ అంటే, వలంటీర్ అంటే ఏం తెలీదు, కానీ ఇప్పుడు అందరి గురించి తెలిసిందన్నారు.
. గతంలో రోడ్లు లేవు, కానీ ఇప్పుడు చక్కటి రోడ్లు వేశారు, మీరు ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలు మాకు అందుతున్నాయి, మీరు మా వెంట ఉన్నామన్న భరోసా ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారని కొనియాడారు.