ANDHRA PRADESHNEWS

గోవుల‌ను కాపాడుకుందాం

Share it with your family & friends

పిలుపునిచ్చిన టీటీడీ చైర్మ‌న్

తిరుప‌తి – సకల దేవతా స్వరూపాలైన గోవులను ప‌రిర‌క్షించు కోవాల్సిన బాధ్య‌త ప్ర‌తి ఒక్క‌రిపై ఉంద‌న్నారు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి. ఇందు కోసం ప్ర‌తిజ్ఞ చేయాల‌ని కోరారు.

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర గో సంరక్షణ శాలలో సంక్రాంతి ప‌ర్వ దినాన్ని పుర‌స్క‌రించుకుని గో మహోత్సవ వేడుకలు ఘ‌నంగా నిర్వ‌హించారు. ముఖ్య అతిథిగా టీటీడీ చైర్మన్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి మాట్లాడారు.

గోవు గొప్పతనాన్ని భావితరాలకు అందించేందుకు గోపూజ కార్యక్రమాన్ని టీటీడీ చేపట్టినట్టు తెలిపారు. తిరుపతి, పలమనేరులోని గోశాలల్లో 2,500కు పైగా గోవులు ఉన్నట్లు చెప్పారు. తిరుమల శ్రీవారి ఉత్సవాలలో, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవాల్లో, స్థానిక ఆలయాలలో జరిగే ఉత్సవాలలో గో శాలలోని ఏనుగులు, అశ్వాలు, వృషబాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని తెలిపారు.

తిరుమల శ్రీవారికి దేశీయ గో జాతుల పాల నుండి తీసిన వెన్నను సమర్పిస్తున్నట్లు చెప్పారు. పూర్వ కాలం నుండి కనుమ పండుగ రోజున గో పూజకు చాల ప్రాధాన్యత ఉందన్నారు. గోవును పూజించడం వ‌ల్ల పాడి పంటలు పుష్కలంగా పండి లోకం సుభిక్షంగా వుంటుందని తెలిపారు. ఇప్పటి వరకు దాతలు రూ.250 కోట్లకు పైగా ఎస్వీ గో సంరక్షణ ట్రస్టుకు విరాళాలు అందించినట్లు వివరించారు.