గౌతమ్ అదానీతో రేవంత్ భేటీ
రాష్ట్రంలో వ్యాపార అవకాశాలపై చర్చ
దావోస్ – ఓ వైపు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ గౌతమ్ అదానీని ఏకి పారేస్తుంటే ఇంకో వైపు అదే పార్టీకి చెందిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆయనతో దావోస్ లో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేవలం పెట్టుబడులే ప్రధాన లక్ష్యంగా తాము ప్రపంచ ఆర్థిక సదస్సు కు వెళ్లడం జరిగిందని స్పష్టం చేశారు.
ఇందులో భాగంగా పలు కంపెనీల ప్రతినిధులు, సిఇవోలు, ఎండీలు, చైర్మన్ లను కలుసుకున్నారు. ఈ టూర్ మూడు రోజుల పాటు కొనసాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కార్యదర్శి జయేష్ రంజన్ ఉన్నారు. వీరితో పాటు ఉన్నతాధికారుల బృందం కూడా అక్కడికి వెళ్లింది.
ఈ దేశంలో ఉన్న వనరులను పూర్తిగా ధార దత్తం చేసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రయత్నం చేస్తున్నాడంటూ విపక్షాలతో పాటు ఇండియా కూటమి గగ్గోలు పెడుతోంది. ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ వస్తున్నారు రాహుల్ గాంధీ.
ఆయన ప్రధానంగా గౌతమ్ అదానీతో పాటు రిలయన్స్ కంపెనీల చైర్మన్ ముఖేష్ అంబానీని కూడా టార్గెట్ చేశారు. ఈ సమయంలో రేవంత్ రెడ్డితో గంటకు పైగా గౌతం అదానీ ములాఖత్ కావడం చర్చకు దారి తీసింది.