చంద్రబాబు అరెస్ట్ కాక తప్పదు
మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి కామెంట్స్
అమరావతి – ఏపీ మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలుగుదేశం పార్టీ చీఫ్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కేసుల నుంచి తప్పించు కోలేరని అన్నారు. బుధవారం మంత్రి మీడియాతో మాట్లాడారు.
ఇంత కాలం అన్ని వ్యవస్థలను మ్యానేజ్ చేస్తూ వచ్చారని కానీ జగన్ మోహన్ రెడ్డిని కాదని తప్పించుకునే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఇప్పటి వరకు ఏపీ సీఐడీ ఆయనపై ఎనిమిది కేసులు నమోదు చేసిందన్నారు.
ఇంత కాలం బెయిల్ లను అడ్డం పెట్టుకుని చిల్లర రాజకీయాలు చేస్తూ వచ్చారని సంచలన ఆరోపణలు చేశారు కాకాణి గోవర్దన్ రెడ్డి. బెయిల్ ఇవ్వక పోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారని , కానీ అక్కడ కూడా చంద్రబాబు నాయుడుకు చుక్కెదురు తప్పదన్నారు.
స్కిల్ స్కామ్ కేసు నుంచి తప్పించు కోవాలని అనుకున్నా ఫైబర్ నెట్ కేసు నుంచి తప్పించు కోవడం అసాధ్యమని స్పష్టం చేశారు మంత్రి. మరోసారి చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడం ఖాయమని జోష్యం చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.