ఛాన్స్ ఇస్తే కలుస్తా లేదంటే శపిస్తా
ప్రజా శాంతి పార్టీ చీఫ్ డాక్టర్ కేఏ పాల్
అమరావతి – ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు ప్రజాశాంతి పార్టీ చీఫ్ డాక్టర్ కేఏ పాల్. మంగళవారం తాడేపల్లి గూడెంలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్దకు వచ్చారు. జగన్ మోహన్ రెడ్డిని కలిసేందుకు తాను వచ్చానని అన్నారు.
అయితే అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో డాక్టర్ కేఏ పాల్ సీఎం క్యాంపు ఆఫీసు లోపటికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. తాను ప్రజా నాయకుడిగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎంతో చర్చించేందుకు ఇక్కడికి వచ్చానని తనను ఎలా అడ్డుకుంటారంటూ ప్రశ్నించారు కేఏ పాల్.
జగన్ మోహన్ రెడ్డి పిలుపు కోసం ఇవాళ మొత్తం వేచి చూస్తానని స్పష్టం చేశారు. అపాయింట్మెంట్ ఇస్తే దీవిస్తా లేదంటే శపిస్తానని హెచ్చరించారు. తాను రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తానని అన్నారు. భారత రాజ్యాంగం తనకు ఇచ్చిన హక్కు అని స్పష్టం చేశారు.
వీలైతే కలిసి పని చేసేందుకు తాను సిద్దంగా ఉన్నానని అన్నారు. ప్రజా తీర్పును ఎవరైనా సరే `శిరసా వహించాల్సిందేనని పేర్కొన్నారు డాక్టర్ కేఏ పాల్. ప్రజలు చైతన్యవంతం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఓటు అన్నది విలువైనదని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆనాడే చెప్పారని అన్నారు. పని చేసే వారిని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.