జనసేనలో చేరిన కొణతాల
సభ్యత్వం స్వీకరించిన మాజీ మంత్రి
అమరావతి – ఏపీ రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బలమైన సామాజిక వర్గానికి ప్రతినిధిగా, అపారమైన రాజకీయ అనుభం కలిగిన నేతగా గుర్తింపు పొందిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ బిగ్ షాక్ ఇచ్చారు. ఆయన పలుమార్లు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. కీలకమైన అంశాలపై చర్చించారు.
అనంతరం తాను అనకాపల్లి నుంచి ఎంపీగా బరిలోకి దిగనున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా టీడీపీ, జనసేన పార్టీలు కలిసి ఈసారి ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయనున్నాయి. దీంతో ఎవరికి ఏయే సీట్లు కేటాయిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ నుంచి తనకు స్పష్టమైన హామీ రావడంతో వెంటనే మరో వైపు ఆలోచించకుండా జనసేన లోకి జంప్ అయ్యారు. గురువారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ తో మరోసారి భేటీ అయ్యారు. అనంతరం సుదీర్ఘ చర్చలు సాగాయి. ఎట్టకేలకు జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు కొణతాల రామకృష్ణ. మొత్తంగా ఆయన ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా బరిలో ఉంటారా అన్నది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.