జనసేనానితో జోగయ్య ములాఖత్
ఎన్నికల్లో సత్తా చాటాలని సూచన
మంగళగిరి- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలకంగా మారారు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్. వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు భేటీ అవుతున్నారు. త్వరలోనే రాష్ట్రంలో శాసన సభ, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఆధ్వర్యంలో ఎన్నికల బృందం పరిశీలించింది. ఏర్పాట్లపై ఫోకస్ పెట్టింది. ఈ కీలక సమావేశానికి టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడుతో పాటు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు.
ఇదిలా ఉండగా జనసేన చీఫ్ తో కలిసేందుకు జనంతో పాటు పార్టీల నేతలు, ఇతర ప్రముఖులు పోటీ పడుతున్నారు. నిన్న ఏపీ మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ తో పాటు తనయుడు కూడా పవన్ కళ్యాణ్ ను మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో కలుసుకున్నారు.
ఇదే సమయంలో ప్రముఖ నాయకుడు, కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్ ను కలుసుకున్నారు. ఈ సందర్బంగా కాపు సత్తా ఏమిటో చాటాలని పిలుపునిచ్చారు. జోగయ్య ములాఖత్ కావడంతో ఏపీలో రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది. ఇంకెంత మంది నాయకులు పవన్ ను కలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, ప్రజలు జగన్ రెడ్డిని సాగనంపేందుకు సిద్దంగా ఉన్నారని జోష్యం చెప్పారు.