జిల్లాలు రద్దు చేస్తే జనం ఊరుకోరు
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ కు ముందుంది ముసళ్ల పండుగ అని హెచ్చరించారు. సినిమా ఇంకా మొదలు కాలేదని, అసలు సినిమా త్వరలో కనిపిస్తుందన్నారు.
తెలంగాణ ప్రాంతం అభివృద్ది కోసం తన తండ్రి మాజీ సీఎం కేసీఆర్ రక్తం చిందించారని, ఆయనపై నిరాధార ఆరోపణలు చేస్తూ ఊరుకునే ప్రసక్తి లేదన్నారు కేటీఆర్. ఇప్పటి వరకు ఇచ్చిన 420 హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు చేసిన పాపాన పోలేదన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలను రద్దు చేస్తామని అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ఒకవేళ ఆ పని చేస్తే ప్రజలు తిరగబడటం ఖాయమని జోష్యం చెప్పారు. నెల రోజుల్లోనే కాంగ్రెస్ పాలన పట్ల తీవ్ర వ్యతిరేకత మొదలైందని చెప్పారు.
బుధవారం జరిగిన వరంగల్ లోక్ సభ నియోజకవర్గ సన్నాహక సమావేశానికి ఆయన హాజరయ్యారు. పదేళ్ల పాటు విధ్వంసానికి గురైన తెలంగాణను వికాసం వైపు నడిపించిన ఘనత కేసీఆర్ కే దక్కిందన్నారు కేటీఆర్. గ్రామీణ ఆర్థిక పరిపుష్టికి ఎంతగానో కృషి చేశారని అన్నారు.
ఓరుగల్లు అంటే ఉద్యమాల వీరగడ్డ అని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే మన నేతలు ఓడిపోయారని వాపోయారు. 2014 , 2019 లలో వరంగల్ ఎంపీ సీటును బీఆర్ఎస్ గెలిచిందని. ఈ సారి కూడా గులాబీ జెండా ఎగరాలని అన్నారు.