టీఎస్పీఎస్సీ ప్రక్షాళన షురూ
నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం
హైదరాబాద్ – లక్షలాది మంది నిరుద్యోల ఆశలపై నీళ్లు చల్లుతూ అవినీతి, అక్రమాలకు కేరాఫ్ గా మారిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పై రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే రాజ్యాంగ బద్దంగా ఎన్నికైన చైర్మన్ బి. జనార్దన్ రెడ్డి, ఇతర సభ్యులను రాజీనామా చేయాల్సిందిగా సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు చైర్మన్, సభ్యులు రాజ్ భవన్ లో రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ కు తమ రాజీనామా లేఖలను సమర్పించారు.
తొలుత వీరి రాజీనామాలను ఆమోదించ లేదు. అయితే గవర్నర్ తో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు సీఎం. ఈ సందర్బంగా ఆమోదించాలని కోరారు. లేక పోతే చైర్మన్ , సభ్యుల భర్తీకి ఇబ్బంది ఏర్పడుతుందని, దీని వల్ల 2 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిలిచి పోతుందని తెలిపారు. పరిస్థితిని అర్థం చేసుకున్న గవర్నర్ చైర్మన్, సభ్యుల రాజీనామాలను ఆమోదించింది. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. వీరి హయాంలో చోటు చేసుకున్న అక్రమాల గుట్టు రట్టు చేసేందుకు విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
దీంతో సీఎం రేవంత్ రెడ్డి వెంటనే చైర్మన్, సభ్యుల నియామకానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సీఎస్ శాంతి కుమారి నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశించింది. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరింది.
దరఖాస్తుల నమూనా పత్రాలను టీఎస్పీఎస్సీ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. చైర్మన్, సభ్యులకు కావాల్సిన అర్హతలు , ఇతర వివరాలను నమోదు చేసింది.
ఈనెల 18 సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తులను ఆన్ లైన్ , లేదా ఈమెయిల్ ద్వారా పంపించాలని సూచించింది.