ట్రాఫిక్ సిబ్బందికి ఆధునిక శిక్షణ
స్పష్టం చేసిన డీజీపీ రవిగుప్తా
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర డీజీపీ రవి గుప్తా కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారింది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచి పోతున్నాయి. ప్రధానంగా పాదచారులకు సైతం నిలువ నీడ లేకుండా పోయింది. నగరం విస్తరించడం, జనాభా ఊహించని రీతిలో పెరిగింది. దీంతో ట్రాఫిక్ నియంత్రణ రోజు రోజుకు కష్టంగా మారింది. తలకు మించిన భారంగా పరిణమించింది.
మరో వైపు సీఎం తనకు ఎక్కువ సెక్యూరిటీ అక్కర్లేదని, ముందుగా అంబులెన్స్ లు వెళ్లేందుకు అవకాశం ఇవ్వాలని స్పష్టం చేశారు. దీంతో డీజీపీ ట్రాఫిక్ సమస్యపై సమీక్ష చేపట్టారు. హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) పరిమితుల్లో ట్రాఫిక్ ను క్రమబద్దీకరించేందుకు, మెరుగు పర్చేందుకు సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు డీజీపీ రవి గుప్తా.
ఉన్నతాధికారులు తగు సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. విజిబుల్ పోలీసింగ్ అమలు, ట్రాఫిక్ సిబ్బందికి ఆధునిక పరమైన శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ లో మరింత మెరుగుదల ఉండాలని సూచించారు.