డిఫెన్స్..ఏరో స్పేస్ సెంటర్ సూపర్
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్ – అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సెంటర్ శంషాబాద్‌లో భారతీయ నావికా దళం కోసం స్వదేశీయంగా తయారు చేసిన దృష్టి 10 స్టార్ లైనర్ మానవ రహిత వైమానిక వాహనాన్ని ఆవిష్కరించింది. ఈ సందర్బంగా జరిగిన ఆత్మ నిర్భర్ స్కైస్ లో పాల్గొన్నారు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు.
భారత ప్రభుత్వం లోని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుండి ఏరోస్పేస్‌కు ద్వైవార్షిక ఉత్తమ రాష్ట్ర అవార్డులను రాష్ట్రం వరుసగా మూడుసార్లు (2018, 2020, 2022) గెలుచుకుందని మంత్రి చెప్పారు. 2016-2020 పరంగా చూస్తే ఈ రంగంలో నంబర్ 1 స్థానంలో ఉందన్నారు.
అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ తమ రక్షణ సామర్థ్యాలను ఏర్పాటు చేసుకోవడానికి హైదరాబాద్‌ను తమ మొదటి ప్రదేశంగా ఎంచుకుందని చెప్పారు. 10 నెలల స్వల్ప వ్యవధిలో, వారు యూఏవీల కోసం మొదటి కార్బన్ ఏరోస్ట్రక్చర్ల తయారీ లైన్‌ను స్థాపించారని తెలిపారు.
డీఆర్డీఏ కోసం అతిపెద్ద డీఈపీపీ భాగస్వాములలో అదానీ ఒకరుగా ఉన్నారని పేర్కొన్నారు. ఏడు ప్రతిష్టాత్మకమైన క్షిపణుల తయారీలో నిమగ్నమై ఉన్నారని చెప్పారు. ఈ క్షిపణుల తయారీ కేంద్రంగా మన హైదరాబాద్ నగరం ఉండడం గర్వ కారణమన్నారు దుద్దిళ్ల శ్రీధర్ బాబు.
మేక్ ఇన్ ఇండియా లో కీలక భాగస్వామ్యం వహిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో రక్షణ, ఏరో స్పేస్ తయారీలో పెట్టుబడులు , అనుబంధ సామర్థ్యాలను మరింతగా పెంచాలని చూడడం అభినందనీయమని పేర్కొన్నారు.