డ్రోన్ పైలట్లకు ఇస్రో శిక్షణ
తెలంగాణ సర్కార్ తో ఒప్పందం
హైదరాబాద్ – ప్రపంచంలోనే అత్యున్నతమైన సంస్థగా పేరు పొందింది ఇస్రో. తాజాగా కీలక ఒప్పందం చేసుకుంది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంతో. ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ)తో తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ డ్రోన్ పైలట్లకు అధానుతన సాంకేతిక శిక్షణ ఇవ్వనుంది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్.
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీఎంతో చాలా సేపు చర్చించారు. ఈ సందర్బంగా తెలంగాణ ఏవియేషన్ అకాడమీ సిఇవో ఎస్ఎన్ రెడ్డి, ఎన్ఆర్ఎస్సీ డైరెక్టర్ ప్రకాశ్ చౌహాన్ అటు ప్రభుత్వం తరపున ఇటు ఇస్రో తరపున ఇరువురు ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఇస్రో చైర్మన్ సోమనాథ్ ను అభినందించారు. ఉపగ్రహాల తయారీలో ఇస్రో ప్రపంచంతో పోటీ పడుతోందని, దీనికి మీరే కారణం అంటూ కితాబు ఇచ్చారు. రాబోయే భవిష్యత్తులో యువతకు ఇస్రో పరంగా అత్యాధునికమైన టెక్నాలజీతో అనుసంధానం చేసి శిక్షణ ఇప్పించేలా చూడాలని సూచించారు.