తిరుమలలో భక్తుల రద్దీ
శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.46 కోట్లు
తిరుమల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతి కెక్కిన తిరుమల పుణ్య క్షేత్రానికి భక్తుల తాకిడి మరింత పెరిగింది. రోజు రోజుకు భక్తుల సందడి నెలకొనడంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సహాయక చర్యలు చేపట్టింది.
శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను దర్శించు కునేందుకు భక్తులు పోటీ పడ్డారు. సంక్రాంతి పర్వదినం పురస్కరించుకుని భారీ ఎత్తున భక్త బాంధవులు తిరుమలకు వేంచేశారు. స్వామి, అమ్మ వార్లను 73 వేల 16 మంది భక్తులు దర్శించుకున్నారు.
20 వేల 915 మంది స్వామి వారికి తలనీలాలు సమర్పించారని టీటీడీ వెల్లడించింది. ఇక భక్తులు నిత్యం స్వామి, అమ్మ వార్లకు సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.46 కోట్లు వచ్చినట్లు తెలిపింది.
భక్తుల తాకిడి పెరగడంతో దర్శనానికి మరింత సమయం పట్టేలా ఉంది. 25 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఎలాంటి టోకెన్లు లేకుండా సర్వ దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు స్వామి వారి దర్శనానికి కనీసం 18 గంటలకు పైగా పట్టే అవకాశం ఉందని టీటీడీ ఈవో ధర్మా రెడ్డి వెల్లడించారు.