తిరుమలలో భక్తుల రద్దీ
శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.39 కోట్లు
తిరుమల – ప్రసిద్ధ పుణ్య క్షేత్రం తిరుమల భక్తులతో కిట కిట లాడుతోంది. ఎక్కడ చూసినా స్వామి వారిని దర్శించు కునేందుకు భక్త బాంధవులు బారులు తీరారు. గోవిందా గోవిందా , ఆపద మొక్కుల వాడా గోవిందా, అనాధ రక్షక గోవిందా, అదివో అల్లదివో శ్రీహరి వాసము, పది వేల శేషుల పడగల మయం, వినరో భాగ్యము వింత కథా అంటూ శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను స్మరించుకుంటూ ముందుకు సాగుతున్నారు భక్తులు.
శుక్రవారం సైతం భక్తుల తాకిడి పెరిగింది. రోజు రోజుకు పెరుగుతున్నారే తప్పా తగ్గడం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం వసతి సౌకర్యాల కల్పనపై ఫోకస్ పెట్టింది. టీటీడీ సీబ్బంది, శ్రీవారి సేవకులు కీలక పాత్ర పోషిస్తున్నారు. నిన్న శ్రీవారిని 69 వేల 874 మంది భక్తులు దర్శించుకున్నారు.
26 వేల 34 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించారని టీటీడీ వెల్లడించింది. భక్తులు నిత్యం సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.39 కోట్లు వచ్చినట్లు తెలిపింది. 16 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వ దర్శనం కోసం ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు కనీసం 18 గంటలకు పైగా పట్టే అవకాశం ఉందని టీటీడీ ఈవో ధర్మా రెడ్డి వెల్లడించారు.