తెలంగాణపై కేంద్రం వివక్ష తగదు
బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్
హైదరాబాద్ – బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో కొలువు తీరిన మోడీ సర్కార్ కావాలని తెలంగాణ రాష్ట్రంపై కక్ష కట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు.
ప్రస్తుతం కేంద్రంలో చక్రం తిప్పుతున్న ఏపీకి ఎక్కువగా నిధులు కేటాయిస్తున్నారంటూ ఆరోపించారు. ఏపీకి ఆయిల్ రిఫైనరీ ఇస్తున్నట్లుగా.. తెలంగాణకు విభజన చట్టంలో పేర్కొన్న కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని ఎందుకు ఇవ్వడం లేదంటూ ప్రశ్నించారు వినోద్ కుమార్.
బీజేపీకి కేంద్రంలో స్వంతంగా మెజారిటీ రాలేదని కానీ చంద్రబాబు చెప్పినట్టు మోడీ ఆడుతున్నారంటూ ఆరోపించారు. ఏపీ విభజన చట్టంలో వున్న అంశాలపై చంద్రబాబు మోడీతో ఇటీవల ఢిల్లీ వెళ్ళినపుడు మాట్లాడారని గుర్తు చేశారు.
విభజన చట్టం షెడ్యూల్ 13 లో ఉన్న పెట్రో కెమికల్, ఆయిల్ రిఫైనరీ హబ్ ఏపీకి కేంద్రం ఇస్తున్నట్లుగా తాను మీడియాలో చూశానని, ఇదే షెడ్యూల్ లో తెలంగాణకు రావాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఉక్కు ప్లాంట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
గత పది సంవత్సరాలుగా కోరుతున్నా తెలంగాణకు ఒక్క ఫ్యాక్టరీ మంజూరు చేయక పోవడం దారుణమన్నారు. తాము ఏపీకి వ్యతిరేకం కాదన్నారు. తెలంగాణ నుంచి బీజేపీ తరపున ఎనిమిది మంది ఎంపీలు గెలిచారని , తెలంగాణ ప్రయోజనాల కోసం అడగాలని కోరారు వినోద్ కుమార్.