తెలంగాణలో అదానీ రూ. 12,400 కోట్లు
సీఎం రేవంత్ తో గౌతమ్ అదానీ ఒప్పందం
దావోస్ – భారతీయ ప్రముఖ వ్యాపార సంస్థ అదానీ గ్రూప్ భారీ పెట్టుబడులు తెలంగాణలో పెట్టనున్నట్లు ప్రకటించింది. దావోస్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్బంగా గౌతమ్ అదానీతో సీఎం భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య గంటకు పైగా చర్చలు జరిగాయి.
ఈ మేరకు తెలంగాణలో ఏకంగా రూ. 12,400 కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు ప్రకటించారు గౌతమ్ అదానీ. ఏకంగా నాలుగు ఒప్పంద పత్రాలపై అదానీ, తెలంగాణ సర్కార్ ఒప్పందం చేసుకుంది. రాబోయే కొన్నేళ్లలో వీటిని ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.
ఇందులో అదానీ గ్రీన్ ఎనర్జీలో భాగంగా తెలంగాణలో 1350 మెగా వాట్ల సామర్థ్యంతో రెండు పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తుంది. ఇందు కోసం రూ. 5,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. అదానీ కన్నెక్స్ డేటా సెంటర్ల కోసం 100 మెగా వాట్స్ సామర్థ్యంతో చందనవెల్లిలో డేటా సెంటర్ క్యాంపస్ ను ఏర్పాటు చేసేందుకు రూ. 5,000 కోట్లు పెట్టనుంది.
అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ 6.0 ఎంటీపీఏ సామర్థ్యంతో తెలంగాణలో సిమెంట్ యూనిట్ లో రూ. 1,400 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. అదానీ డిఫెన్స్ పార్క్‌లోని కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్ , మిస్సైల్ డెవలప్‌మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్లలో రూ. 1,000 కోట్లు పెట్టుబడి పెడుతుంది.
ఇదిలా ఉండగా ప్రాజెక్టులకు అవసరమైన సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు, మద్దతును తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తుందని అదానీకి సీఎం హామీ ఇచ్చారు.