తెలంగాణలో కొత్త విద్యుత్ పాలసీ
స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో త్వరలో కొత్త విద్యుత్ పాలసీని తీసుకు వస్తున్నట్లు వెల్లడించారు. విద్యుత్ శాఖపై సచివాలయంలో సమీక్ష చేపట్టారు సీఎం. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు.
అసెంబ్లీ లోనూ, నిపుణులతోనూ విద్యుత్ విధానంపై చర్చలు జరిపామని చెప్పారు. 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయాల్సిందేనని స్పష్టం చేశారు. గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చామని దానిని అమలు చేస్తామన్నారు.
విద్యుత్తు రంగ నిపుణులు వివిధ రాష్ట్రాల విద్యుత్తు విధానాలను సమగ్రంగా అధ్యయనం చేయాలని, వాటిని అసెంబ్లీలో చర్చించాలన్నారు. అనంతరం అందరికీ ఆమోద యోగ్యమైన విధానం అమలుకు శ్రీకారం చుట్టాలన్నారు సీఎం.
రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, విద్యుత్ కంపెనీల నుంచి విద్యుత్ కొనుగోళ్లు, విద్యుత్ వినియోగం, డిస్కంల పనితీరు, ఆర్థిక పరిస్థితి పైన వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత 2014 నుంచి ఇప్పటిదాకా విద్యుత్ కంపెనీలు, విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) మధ్య జరిగిన ఒప్పందాలు, ఆ ఒప్పందాల్లోని అంశాలు, విద్యుత్తుకు చెల్లించిన ధరలు వంటి వాటిపై సమగ్రంగా అధ్యయనం చేస పూర్తి వివరాలను అందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.