త్వరలో నూతన పారిశ్రామిక విధానం
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడి
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో త్వరలో నూతన పారిశ్రామిక విధానం (పాలసీ) తీసుకు వస్తామని స్పష్టం చేశారు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. ప్రజలు మార్పు కోరుకున్నారని, వారి కోరిక మేరకు పాలనా పరంగా భిన్నంగా ఉండేలా చేస్తున్నామని అన్నారు.
పరిశ్రమల రంగంలోనూ మార్పులు తీసుకు వస్తామని చెప్పారు. త్వరలో ఫ్రెండ్లీ ఇండస్ట్రీ పాలసీని తీసుకు రావాలన్నది తమ ఉద్దేశమని పేర్కొన్నారు. పరిశ్రమలకు తిరిగి నూతన ఉత్తేజాన్ని తీసుకు వచ్చేలా చేస్తామన్నారు శ్రీధర్ బాబు.
అందరి సలహాలు స్వీకరిస్తామని, ఎంఎస్ఎంఈలకు తోడ్పాటు అందిస్తామని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసిందని ఆరోపించారు. తాజాగా పారిశ్రామికవేత్తలతో మంత్రి ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్బంగా వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
తమ ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు స్వాగతం పలుకుతుందన్నారు. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు. ఎవరైనా సరే నేరుగా తనను వచ్చి కలవవచ్చని తెలిపారు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి.
బీహెచ్ఈఎల్, డీఆర్డీఎల్, డీఎల్ఆర్ఐ, మిథాని వంటి సంస్థలను స్థాపించడమే కాదు, లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉందన్నారు. తాము 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను కల్పిస్తామని ఎన్నికల మెనిఫెస్టోలో పేర్కొన్నామని, ఆ మేరకు అమలు చేస్తామని స్పష్టం చేశారు. అయినప్పటికీ పారిశ్రమిక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తూ మరిన్ని లక్షల మందికి ఉద్యోగాలు లభించేలా కృషి చేస్తామని, అందుకు పారిశ్రామిక వర్గాలు చొరువ తీసుకోవాలని కోరారు.