దక్కిన పురస్కారం స్మిత సంతోషం
విశిష్ట సేవలకు సబర్వాల్ ఎంపిక
హైదరాబాద్ – తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ నిత్యం వార్తల్లో ఉంటారు. ఆమె సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఏదో ఒక అంశానికి సంబంధించి తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వస్తారు. స్త్రీ పక్షపాతిగా పేరు పొందారు. సమాజంలో మహిళలు అన్ని రంగాలలో ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పదే పదే ప్రస్తావిస్తూ వస్తారు.
గతంలో కొలువు తీరిన బీఆర్ఎస్ పాలనలో స్మితా సబర్వాల్ కీలకమైన పాత్ర పోషించారు. మిషన్ భగరీత, మిషన్ కాకతీయ, నీటి పారుదల శాఖలను చూశారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి పేషీలో సీఎంఓ కార్యదర్శిగా కూడా ఉన్నారు. విశిష్ట సేవలు అందించారు.
ఆమెపై ఎన్ని ఆరోపణలు వచ్చినా ఎక్కడా తగ్గలేదు. తను జిల్లా కలెక్టర్ గా పని చేసిన సమయంలో ప్రజలకు సేవలు అందించడంలో సక్సెస్ అయ్యారు. ఆమెకు ప్రజా కలెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. స్మితా సబర్వాల్ పేరు దేశ వ్యాప్తంగా మారు మ్రోగింది.
సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా పాలు పంచుకుంటారు. ఇందులో భాగంగా రోటరీ డెక్కన్ చాప్టర్ సంస్థ వృత్తి పరంగా విశిష్ట సేవలు అందించిన మహిళలకు పురస్కారాలను ప్రదానం చేసింది. ఇందులో భాగంగా స్మితా సబర్వాల్ కు కూడా అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా సంతోషాన్ని వ్యక్తం చేశారు సీనియర్ అధికారిణి.