దాడులు చేయడం దారుణం
అయినా బెదిరేది లేదన్న సీఎం
హైదరాబాద్ – భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీని పనిగట్టుకుని అడ్డుకోవడం, దాడులకు తెగ బడటంపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతోంది. ఇదే సమయంలో పలువురు కీలక నేతలు , సీఎంలు, మాజీ సీఎంలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజాగా తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్దతి కాదన్నారు. దీనిని ప్రతి ఒక్కరు ఖండించాలని పిలుపునిచ్చారు. అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ సారథ్యంలో బీజేపీ మూకలు రెచ్చి పోతున్నాయని, కొంచెం తగ్గించుకుంటే మంచిదని హితవు పలికారు.
దాడులకు దిగబడటం ఎవరైనా చేస్తారని కానీ డెమోక్రసీ కాదన్నారు. ఇలాంటి వాటికి చోటు లేదన్నారు రేవంత్ రెడ్డి. ఈ దేశంలో నిరసన తెలిపేందుకు, ప్రశ్నించేందుకు హక్కు ఉందన్న విషయం సీఎం తెలుసు కోవాలని అన్నారు.
రాహుల్ గాంధీ భద్రత విషయంలో ఉదాసీనంగా వ్యవహరించడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దాడులు చేసినంత మాత్రాన తాము వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదని హెచ్చరించారు రేవంత్ రెడ్డి. ఈ దేశ ప్రజల మద్దతు రాహుల్ కు ఉందన్న విషయం మరిచి పోకూడదని పేర్కొన్నారు.