దావోస్ సీఎం టూర్ సక్సెస్
తెలంగాణకు భారీగా పెట్టుబడులు
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని బృందం దావోస్ పర్యటన విజయవంతమైంది. సీఎంతో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు కార్యదర్శి జయేష్ రంజన్, ఉన్నతాధికారులు ఉన్నారు. మూడు రోజుల పాటు పర్యటించారు. ఈ టూర్ అత్యంత ఫలవంతంగా ముగిసిందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలంగాణ సర్కార్ ప్రకటించింది.
దావోస్ పర్యటన ముగించుకుని రేవంత్ రెడ్డి బృందం గురువారం లండన్ పర్యటన నిమిత్తం బయలు దేరి వెళ్లింది. అక్కడ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఔత్సాహికులు, పారిశ్రామికవేత్తలు, ఐటీ రంగ నిపుణులు, సిఇఓలతో భేటీ కానున్నారు.
ఇదిలా ఉండగా దావోస్ పర్యటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత దేశంలోనే అతి పెద్ద పామాయిల్ తయారీ యూనిట్ కు తెలంగాణ రాష్ట్రం ఎంపికైంది. ఖమ్మం జిల్లాలో దీనిని ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు గోద్రెజ్ కంపెనీ చైర్మన్ , ఎండీ నాదిర్ గోద్రెజ్. ఆయన సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. రూ. 270 కోట్ల పెట్టుబడితో ఇంటిగ్రేటెడ్ ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ కాంప్లెక్స్ లో ఒకదానిని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.