దేవుని గడప బ్రహ్మోత్సవాలు
ఫిబ్రవరి 10 నుండి 18వ తేదీ వరకు
కడప – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా భక్తులు భావించే కడప లోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు సిద్దమైంది. ఫిబ్రవరి 10 నుండి 18వ తేదీ వరకు ఎనిమిది రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తులు భారీగా తరలి రానున్నారు.
వైస్సార్ జిల్లా దేవుని గడపగా ఈ ఆలయం ప్రసిద్ది చెందింది. వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఫిబ్రవరి 9న సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల మధ్య అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
ఫిబ్రవరి 15వ తేదీ ఉదయం 10 గంటలకు స్వామి వారి కల్యాణోత్సవం జరుగనుంది. రూ.300/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చని టీటీడీ వెల్లడించింది. ఫిబ్రవరి 19వ తేదీ సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం జరుగనుంది.
ఉత్సవాలలో భాగంగా ఫిబ్రవరి 10న ఉదయం ధ్వజారోహణం, రాత్రి చంద్రప్రభ వాహనంపై ఊరేగుతారు. 11న ఉదయం సూర్య ప్రభ వాహనం, రాత్రి పెద్ద శేష వాహనం, 12న ఉదయం చిన్న శేష వాహనం, రాత్రి సింహ వాహనం, 13న ఉదయం కల్ప వృక్ష వాహనం, రాత్రి హనుమంత వాహనంపై దర్శనం ఇస్తారు భక్తులకు.
14న ఉదయం ముత్యపు పందిరి వాహనం, రాత్రి గరుడ వాహనం, 15న ఉదయం కళ్యాణోత్సవం, రాత్రి గజ వాహనం, 16న ఉదయం రథోత్సవం, రాత్రి ధూళి ఉత్సవం, 17న ఉదయం సర్వ భూపాల వాహనం, రాత్రి అశ్వ వాహనం, 18న ఉదయం వసంతోత్సవం, చక్ర స్నానం, రాత్రి హంస వాహనం, ధ్వజావరోహణం ఉంటుందని టీటీడీ స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజు హరి కథలు, భక్తి సంగీత ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.