ద్వేషం నశిస్తుంది ప్రేమ గెలుస్తుంది
స్పష్టం చేసిన ఎంపీ రాహుల్ గాంధీ
మేఘాలయ – ఈ దేశానికి కావాల్సింది మతం కాదు మానవత్వం కావాలని స్పష్టం చేశారు వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ. తాను చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర పవిత్రమైన భూమిగా పేరు పొందిన నాగాలాండ్ లోకి ప్రవేశించింది. ఈ సందర్బంగా భారీ బహిరంగ సభను ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగించారు.
కులం, మతం అన్నది వ్యక్తిగతం. కానీ దానిని రాజకీయంగా వాడుకోవడం క్షమించరాని నేరమన్నారు. ఇవాళ అన్ని వ్యవస్థలు కునారిల్లి పోయాయని, ఏ ఒక్క దానికి ప్రస్తుతం కొలువు తీరిన మోదీ బీజేపీ సంకీర్ణ సర్కార్ బాధ్యత వహించడం లేదని ఆరోపించారు రాహుల్ గాంధీ.
ఇవాళ నిరుద్యోగం, ద్రవ్యోల్బణం అత్యంత ప్రమాదకరమైన స్థితికి చేరుకుందన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు దివాళా అంచున ఉన్నాయని వాటిని తిరిగి ప్రారంభించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ప్రతి ఏడు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చారని, కానీ పదేళ్లు పూర్తయినా 10 వేల జాబ్స్ కూడా భర్తీ చేసిన పాపాన పోలేదన్నారు రాహుల్ గాంధీ. ప్రధాని మోదీని టార్గెట్ చేశారు. కావాలని తనపై దాడి చేయించేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. అయినా తాను బెదిరే ప్రసక్తి లేదని హెచ్చరించారు.