ద్వేషానికి దూరం ప్రేమకు అందలం
మతం పేరుతో రాజకీయం చేయను
అస్సాం – వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను అన్ని వర్గాల వారిని, అన్ని కులాలు, మతాలకు చెందిన గౌరవిస్తానని స్పష్టం చేశారు. తాను కుల, మతాల పేరుతో రాజకీయాలు చేసేందుకు వ్యతిరేకమన్నారు. తాను లౌకిక వాదినని, ప్రతి ఒక్కరికీ ఈ దేశంలో సమాన హక్కులు, అవకాశాలు అందాలని కోరుకునే వాడిలో తాను ముందుంటానని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ.
ప్రజలు ఎదుర్కొంటున్న సవాలక్ష సమస్యలను ప్రస్తావించేందుకు, వారిని చైతన్యవంతం చేసేందుకే రెండో విడత భారత్ జోడో న్యాయ్ యాత్ర చేపట్టానని చెప్పారు. ప్రతి ఒక్కరు తన యాత్రకు మద్దతు తెలపడం, ఆదరించడం ఆనందంగా ఉందన్నారు.
తాను ఏనాడూ పదవులు కోరుకోలేదన్నారు. ప్రజలు అన్ని రంగాలలో పాలు పంచు కోవాలని, మెరుగైన వసతి సౌకర్యాలు అందాలన్నదే తన అభిమతమని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ. ఈ దేశంలో ఇప్పుడు మత వాదంతో మనుషులను విడదీసేందుకు ప్రయత్నం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
అన్ని వ్యవస్థలను నాశనం చేయడమే కాకుండా పేదలు, బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలను అభివృద్ది ఫలాలకు దూరంగా ఉంచే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. దీనిని తాను మొదటి నుంచి అడ్డుకుంటూ వస్తున్నానని అన్నారు.