నియోజకవర్గాలకు నిధులు ఇవ్వండి
సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేల లేఖ
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో తమ నియోజకవర్గాలకు సంబంధించి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ సందర్బంగా సుదీర్ఘమైన లేఖ అందజేశారు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు, ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్, మానకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణ.
ప్రత్యేకించి గతంలో కొలువు తీరిన భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం కావాలని దళిత సామాజిక వర్గానికి చెందిన నియోజకవర్గాలను, దళితులను పట్టించు కోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టాయని ఆరోపించారు లేఖలో.
వెంటనే తమ నియోజకవర్గాలకు కనీసం రూ. 10 కోట్లకు తగ్గకుండా అభివృద్ది పనులు చేపట్టేందుకు యుద్ద ప్రాతిపదికన నిధులు మంజూరు చేయాలని, ఈ మేరకు వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ఆదేశించాలని కోరారు. ఇప్పటికే గత సర్కార్ అభివృద్ది పేరుతో విధ్వంసాన్ని సృష్టించిందని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఈ సందర్భంగా నిధులు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి.