నేనూ రామ భక్తుడినే
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్ – రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈనెల 22న అయోధ్య లోని రాముడి పునః ప్రతిష్ట కార్యక్రమాన్ని కేంద్ర సర్కార్ తన భుజాల మీద వేసుకుని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పాటు పడకుండా మతాన్ని రాజకీయంతో మిళితం చేసి ఓట్లు కొల్లగొట్టాలని చూస్తోందని ఆరోపించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.
గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను తన కుటుంబం రామ భక్తులమేనని స్పష్టం చేశారు. కానీ రామాలయం పూర్తి కాకుండానే ప్రధాన మంత్రి ఆలయాన్ని ప్రారంభిస్తుండడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆది శంకరాచార్యుల కంటే ఏమైనా ఎక్కువ తెలుసా మోదీకి అంటూ ఫైర్ అయ్యారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.
ఆచార్యులు, పీఠాధిపతులు శాస్త్రానికి విరుద్దంగా జరుగుతోందని ఇప్పటికే అభ్యంతరం చెప్పారని గుర్తు చేశారు. వీటన్నింటిని పట్టించు కోకుండా మోదీ ఒంటెద్దు పోకడ పోతున్నారంటూ ఆరోపించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.
అయితే రామాలయం పూర్తయ్యాక తాను కూడా అయోధ్యకు వెళతానని చెప్పారు. రాముడి దర్శనం చేసుకుంటానని , తాను ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. అన్ని కులాల, మతాల వారిని సమానంగా చూస్తానని చెప్పారు.