పిలవక పోయినా అయోధ్యకు వెళతాం
స్పష్టం చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ – బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం శ్రీరాముడి మేనియా కొనసాగుతోంది. ప్రతి చోటా శోభా యాత్ర నిర్వహిస్తున్నారు హిందూ భక్తులు. ఈనెల 22న సోమవారం ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ఇందుకు సంబంధించి శ్రీరామ జన్మ భూమి ట్రస్టు దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానాలు ఇప్పటికే అందజేసింది. మొత్తం 7,000 మందికి పైగా ఇన్విటేషన్లు ఇచ్చింది.
అయితే నిన్నటి ఎన్నికల దాకా మిత్రపక్షంగా ఉంటూ వచ్చిన భారత రాష్ట్ర సమితి పార్టీకి, బాస్ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఎలాంటి ఆహ్వానం పంపించక పోవడం విస్తు పోయేలా చేసింది. అయితే ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనంటూ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేయడంలో సక్సెస్ అయ్యింది. అధికారం కోల్పోయేలా చేసింది.
ఇదిలా ఉండగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం మీడియాతో మాట్లాడారు. తమకు అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానించ లేదన్నారు. అయినా ఓ భక్తురాలిగా తాము అయోధ్యకు వెళ్లి తీరుతామని స్పష్టం చేశారు. మరో వైపు ఈడీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు నోటీసులు జారీ చేసింది.