పీసీసీ చీఫ్ కావడం నా అదృష్టం
ఆనందం వ్యక్తం చేసిన షర్మిల
అమరావతి – ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ గా కొలువు తీరడం తనను ఎంతగానో విస్తు పోయేలా చేసిందన్నారు. తాను కలలో కూడా అనుకోలేదన్నారు. అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి , చీఫ్ ఖర్గే , మాజీ చీఫ్ లు రాహుల్ , ప్రియాంక గాంధీకి ధన్యవాదాలు తెలిపారు.
తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండు సార్లు పీసీసీ చీఫ్ గా ఉన్నారని గుర్తు చేశారు. వైఎస్సార్ బాధ్యతలు చేపట్టిన పదవిని స్వీకరించడం తనకు ఎంతగానో ఆనందంగా ఉందన్నారు వైఎస్ షర్మిల.
తనను నమ్మిన కాంగ్రెస్ పెద్దలకు కృతజ్ఞతలు తెలియ చేస్తున్నానని పేర్కొన్నారు. రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయాలన్న తన తండ్రి వైఎస్సార్ కలలను నిజం చేసేందుకు తనకు అద్భుతమైన అవకాశం దక్కిందన్నారు.
ఇందుకు గాను శాయ శక్తులా కృషి చేస్తానని చెప్పారు. భారతీయ జనతా పార్టీ ఏపీకి తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే ఏపీ ఎంతో అభివృద్ధి చెందేదన్నారు.
టీడీపీ, వైసీపీలు బీజేపీ తొత్తులుగా మారి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టాయని ఆరోపించారు వైఎస్ షర్మిల. .బీజేపీ చేసే మత రాజకీయాలకు ప్రత్యక్షంగా,పరోక్షంగా మద్దతు ఇస్తున్నాయని మండిపడ్డారు. . ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ, టీడీపీలకు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లేనని ఎద్దేవా చేశారు.