పుణ్య క్షేత్రం భక్త జన సందోహం
శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.77 కోట్లు
తిరుమల – ఓ వైపు కరోనా కలకలం రేపుతున్నా భక్తులు మాత్రం లెక్క చేయడం లేదు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను కొలుస్తారు. సుదూర ప్రాంతాల నుంచే కాకుండా దేశంలోని పలు ప్రాంతాల నుంచి తిరుమలకు చేరుకుంటున్నారు.
ఓ వైపు మంచు దుప్పటి కప్పేస్తోంది. ఎక్కడ చూసినా చలి వాతావరణం ఇబ్బంది పెడుతోంది. అయినా శ్రీవారి భక్తులు ఎక్కడా తగ్గడం లేదు. కాలి నడకన శ్రీవారి దర్శన భాగ్యం కోసం నానా తంటాలు పడుతూ చేరుకుంటున్నారు. కొందరు శ్రీవారి మెట్ల నుంచి వెళుతుంటే మరికొందరు అలిపిరి మెట్ల ద్వారా తిరుమలను చేరుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
ఈ తరుణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు చేపట్టింది. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి దర్శించుకునందుకు వచ్చే భక్తులకు త్వరితగతిన దర్శన భాగ్యం కల్పించేందుకు ప్రయత్నం చేస్తోంది.
ఇక దర్శనానికి సంబంధించి చూస్తే స్వామి వారిని 65 వేల 901 మంది భక్తులు దర్శించుకున్నారు. 16 వేల మంది తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.77 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.