పుణ్య క్షేత్రం భక్త సందోహం
రూ. 3.89 కోట్ల హుండీ ఆదాయం
తిరుమల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా భావించే తిరుమల పుణ్య క్షేత్రం భక్త బాంధవులతో నిండి పోయింది. ఎక్కడ చూసినా భక్తులే. గోవిందా గోవిందా శ్రీనివాసా గోవిందా, ఆపద మొక్కుల వాడా గోవిందా..అనాధ రక్షక గోవిందా..అదివో అల్లదివో శ్రీహరి వాసము, పది వేల అడుగుల మయం అంటూ పాడుకుంటూ స్వామి వారిని కీర్తిస్తున్నారు.
తెలుగు వారి ఆత్మీయంగా భావించే సంక్రాంతి పర్వదినం కావడంతో తిరుమల పుణ్య క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. దీంతో అన్ని కంపార్ట్ మెంట్లు నిండి పోయాయి. రోజు రోజుకు భక్తుల రద్దీ పెరుగుతోందే తప్పా తగ్గడం లేదు. ఓ వైపు కరోనా తాకిడి భయ పెడుతున్నా లెక్క చేయడం లేదు.
ఇదిలా ఉండగా తిరుమల లోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్ మెంట్లు నిండి పోయాయి. ఏటీసీ వరకు క్యూ లైన్ లో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 16 గంటల సమయం పడుతుందని టీటీడీ ఈవో ఏవీ ధర్మా రెడ్డి తెలిపారు.
కాగా శ్రీనివాసుడిని, శ్రీ అలివేలు మంగమ్మలను 80 వేల 964 మంది దర్శించుకున్నారు. 27 వేల 657 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.89 కోట్లు వచ్చిందని టీటీడీ వెల్లడించింది.