పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం
స్పష్టం చేసిన రేవంత్ రెడ్డి
దావోస్ – ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. ఆయనతో పాటు మంత్రి శ్రీధర్ బాబు , జయేష్ రంజన్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా పలువురితో భేటీ అయ్యారు సీఎం.
రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా తాను ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. ఐటీ, జీవ వైద్య శాస్త్ర రంగానికి ముఖ్య కేంద్రంగా అభివృద్ధి చెందిన తెలంగాణ గురించి ప్రపంచానికి చాటి చెప్పేందుకు, భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు కీలక చర్చలు జరిపింది.
దావోస్ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి వరల్డ్ ఎకనామిక్ ఫోరం చీఫ్ తో పాటు నిర్వాహకులు, ఇతర ప్రముఖులతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. రాష్ట్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం ప్రాధాన్యతలను వివరించారు.
ప్రభుత్వాలతో పాటు పారిశ్రామికవేత్తలు, వ్యాపార, వాణిజ్య నాయకత్వం కలిసికట్టుగా పని చేస్తే ప్రజలు సంపన్నులవుతారని, సుస్థిరమైన అభివృద్ధితో పాటు జీవన ప్రమాణాలు మెరుగు పడితే మరింత ఆనందంగా ఉంటారనే దృక్కోణంలో చర్చలు జరిపారు.
రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించటం, అందుకోసం అనుసరించే భవిష్యత్తు కార్యక్రమాలపై చర్చించారు. ఇంజినీరింగ్, డిగ్రీ కోర్సులు చదువుతున్న యువతకు స్కిల్ డెవెలప్మెంట్, ప్లేస్మెంట్ కమిట్మెంట్, ఉద్యోగ కల్పనకు సాయం అందించే అంశాలపై సంప్రదింపులు జరిపారు.