ANDHRA PRADESHNEWS

పొత్తుపై హైక‌మాండ్ దే నిర్ణ‌యం

Share it with your family & friends

క్లారిటీ ఇచ్చిన పురంధేశ్వ‌రి

అమ‌రావ‌తి – భార‌తీయ జ‌న‌తా పార్టీ ఏపీ చీఫ్ ద‌గ్గుబాటి పురంధేశ్వ‌రి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. జ‌న‌సేనతో బీజేపీ పొత్తు ఉంటుందా అన్న దానిపై చ‌ర్చించాల్సిన అవ‌స‌రం లేదన్నారు. మొద‌టి నుంచీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో క‌లిసి న‌డుస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు.

ఇరు పార్టీల మ‌ధ్య బంధం కొన‌సాగుతుంద‌ని, ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. అయితే మ‌రోసారి భేటీ కావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. తాను క‌లిసి ముందుకు సాగాల‌ని అనుకుంటున్నాన‌ని, ఇదే విష‌యంపై హైక‌మాండ్ తో కూడా చ‌ర్చించ‌డం జ‌రిగింద‌న్నారు.

అయితే పొత్తు కొన‌సాగించాలా లేక వ‌ద్దా లేక రాబోయే అసెంబ్లీ, లోక్ స‌భ ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా వెళ్లాలా అన్న‌ది తేల్చాల్సింది, అంతిమ నిర్ణ‌యం తీసుకోవాల్సింది మాత్రం పార్టీ హైక‌మాండ్ నిర్ణ‌యం తీసుకుంటుంద‌న్నారు పురంధేశ్వ‌రి. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు.

గ‌తంలో ఏపీలో కొలువు తీరిన చంద్ర‌బాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ , ప్ర‌స్తుతం ప‌వ‌ర్ లో ఉన్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ కేంద్ర స‌ర్కార్ ప‌థ‌కాల‌ను హైజాక్ చేశాయ‌ని ఆరోపించారు. ఓర్వ‌క‌ల్లు ఎయిర్ పోర్టు నిర్మాణానికి నిధులు తాము ఇచ్చామ‌ని, కానీ జ‌గ‌న్ ప్ర‌చారం చేసుకోవ‌డం దారుణ‌మన్నారు. అయోధ్య రాముడి పునః ప్ర‌తిష్ట రోజు సెల‌వు ప్ర‌క‌టించ‌క పోవడం బాధాక‌ర‌మ‌న్నారు పురంధేశ్వ‌రి.