ANDHRA PRADESHNEWS

పోటీ చేయ‌ను ప్ర‌చారం చేస్తా

Share it with your family & friends

మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్

అమ‌రావ‌తి – మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను పోటీ చేయ‌బోవ‌డం లేద‌ని స్ప‌ష్టం చేశారు. తాను తిరిగి పాలిటిక్స్ లోకి వ‌స్తున్నాన‌ని జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని కొట్టి పారేశారు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

అంత‌కు ముందు మాజీ ఎంపీలు ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ , హ‌ర్ష కుమార్ ల‌ను క‌లుసుకున్నారు. ఈ ముగ్గురు కీల‌క నాయ‌కులు ఒకేచోట క‌లుసు కోవ‌డం ఏపీ రాజ‌కీయాల‌లో క‌ల‌క‌లం రేపింది.

కాంగ్రెస్ పార్టీలో తిరిగి కీల‌క పాత్ర పోషిస్తున్న‌ట్లు వ‌స్తున్న ప్ర‌చారం వ‌ట్టిదేన‌ని పేర్కొన్నారు. అయితే లోక్ స‌భ ఎన్నిక‌ల్లో ఉండ‌వ‌ల్లి, హ‌ర్ష కుమార్ పోటీ చేయాల‌ని తాను కోరుకుంటున్న‌ట్లు చెప్పారు. అంతే కాదు తాను కాంగ్రెస్ పార్టీ అభిమానిన‌ని స్ప‌ష్టం చేశారు.

త‌న‌కు తిరిగి రాజ‌కీయాల‌లోకి రావాల‌న్న ఆలోచ‌నే లేద‌న్నారు ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్. ఏపీలోని కాకినాడ‌లో ఫంక్ష‌న్ ఉంద‌ని, వెళుతూ మార్గ‌మధ్యంలో క‌లిశాన‌ని చెప్పారు. ప్ర‌జ‌ల కోసం తాను ముందు నుంచీ ప‌ని చేస్తూ వ‌చ్చాన‌ని అన్నారు.

అయితే త‌న‌కు రాజ‌కీయంగా జ‌న్మ‌నిచ్చింది మాత్రం కాంగ్రెస్ పార్టీనేన‌ని స్ప‌ష్టం చేశారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ‌డం ప‌ట్ల సంతోషంగా ఉంద‌ని అన్నారు ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్. మ‌రో వైపు వైఎస్ ష‌ర్మిల కాంగ్రెస్ పార్టీలో చేర‌డాన్ని ఆయ‌న స్వాగ‌తించారు.