ప్రతి ఇంటా రామ దీపం వెలగాలి
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
అయోధ్య – దేశంలో అపూర్వమైన ఘట్టం ఆవిష్కృతమైందని, ఇక ప్రతి నోటా శ్రీరామ నామ జపం మారుమ్రోగాలి. ప్రతి ఇంటా శ్రీరామ దీపం వెలగాలని పిలుపునిచ్చారు ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ. సోమవారం అయోధ్యలో శ్రీరాముడి పునః ప్రతిష్టాపన కార్యక్రమం పూర్తయింది.
అనంతరం పీఎం ప్రసంగించారు. రామ భక్తులందరికీ నమస్కరిస్తున్నానని అన్నారు. 500 ఏళ్ల నాటి నుంచి ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న రాముడు వచ్చేశాడని చెప్పారు. ఈ క్షణం , ఈ కాలం ఈ ఏడాది ఎంతో ప్రత్యేకమైనదని అన్నారు మోదీ. ఇవాళ నాకు చెప్పలేనంత ఆనందం కలుగుతోందన్నారు. గర్భ గుడిలో ప్రాణ ప్రతిష్టకు హాజరు కావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.
రామ్ లల్లా ఇక టెంట్ లో ఉండడని, గర్భ గుడిలో సేద దీరుతాడని అన్నారు నరేంద్ర దామోదర దాస్ మోదీ. ఇవాళ మాట్లాడుతుంటే తన గొంతు వణుకుతోందన్నారు. జనవరి 22 అనేది కేవలం తేదీ మాత్రమే కాదని కొత్త శకానికి నాంది పలుకుతోందన్నారు.
రాముడి ఉనికిపై దశాబ్దాలుగా న్యాయ పోరాటం సాగిందన్నారు. చివరకు భారత న్యాయ వ్యవస్థ సరైన తీర్పుతో దీనికి ముగింపు పలికిందన్నారు మోదీ. ఈ సందర్బంగా సర్వోన్నత సంస్థకు ధన్యవాదాలు తెలియ చేస్తున్నానని చెప్పారు. రాముడు విగ్రహం కాదు. అది భారత దేశానికి ఆత్మ అని చెప్పారు. ఇవాళే ఈ దేశ ప్రజలకు నిజమైన దీపావళి అని స్పష్టం చేశారు.