ప్రశ్నిస్తే దాడికి పాల్పడతారా
నిప్పులు చెరిగిన ఏఐసీసీ చీఫ్
అస్సాం – తమ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు జైరాం రమేష్ పై బీజేపీ శ్రేణులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే. వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో పాల్గొనేందుకు బయలు దేరి వెళ్లిన జైరాం రమేష్ కు చెందిన వాహనంపై బీజేపీ మూకలు వ్యక్తిగత దాడికి దిగడం దారుణమన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు ఖర్గే.
దీనిని తాము చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరించారు. ఇలాంటి చవకబారు ప్రయోగాలకు, దాడులకు తాము వెనుకడుగు వేసే ప్రసక్తి లేదన్నారు ఏఐసీసీ చీఫ్. ఇది ఎంత మాత్రం ఆహ్వానించ దగినది కాదని పేర్కొన్నారు.
భారత దేశం అనేది మతంతో కూడిన దేశం కాదని గుర్తు పెట్టుకోవాలని చురకలు అంటించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి. మనుషుల మధ్య చిచ్చు పెట్టి , కులాలు, మతాల పేరుతో విధ్వంసం సృష్టించి ఓట్లు కొల్లగొట్టాలని అనుకోవడం దారుణమన్నారు.
ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, బీజేపీ మతతత్వ పార్టీకి గుణపాఠం చెప్పడం ఖాయమని జోష్యం చెప్పారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే. ఇకనైనా వాస్తవాలను గుర్తు పెట్టుకుని నడుచుకుంటే మంచిదని సూచించారు.