బండి కామెంట్స్ పొన్నం సీరియస్
కాంగ్రెస్ సర్కార్ ను కూల్చే దమ్ము లేదు
హైదరాబాద్ – సార్వత్రిక ఎన్నికల వరకే తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఉంటుందని, కేసీఆర్ మామూలోడు కాదని, ఆయన పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నారు బండి సంజయ్. ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
దీనిపై తీవ్రంగా స్పందించారు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ధైర్యం భారత రాష్ట్ర సమితి పార్టీకి లేదన్నారు. కేంద్రంలో మరోసారి బీజేపీ గనుక అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ పార్టీకి ముప్పు ఉంటుందన్నారు.
బండి సంజయ్ ఆచి తూచి మాట్లాడాలని సూచించారు. ఆయన కామెంట్స్ కు పొన్నం ప్రభాకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనని పేర్కొన్నారు. ఇలాంటి చవకబారు మాటలు మాట్లాడటం మానుకోవాలని బండి సంజయ్ కుమార్ పటేల్ కు హితవు పలికారు మంత్రి.
బీఆర్ఎస్ పనై పోయిందని, తమతో పోటీ పడే సత్తా వారికి లేదన్నారు. రాష్ట్రాన్ని తెలంగాణ పేరుతో దోపిడీ చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని పేర్కొన్నారు పొన్నం ప్రభాకర్. తాము ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.