NEWSTELANGANA

బీఆర్ఎస్ ను పాత‌రేస్తా – రేవంత్

Share it with your family & friends

లోక్ స‌భ ఎన్నికల్లో ప‌త‌నం త‌ప్ప‌దు

లండ‌న్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. శ‌నివారం ఆయ‌న ఎన్నారైలు ఏర్పాటు చేసిన స‌మావేశంలో ప్ర‌సంగించారు. తాజాగా జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో చెప్పి మరీ గులాబీ పార్టీని ఓడించామ‌ని , సేమ్ సీన్ లోక్ స‌భ ఎన్నిక‌ల్లో జ‌రుగుతుంద‌ని జోష్యం చెప్పారు.

ద‌మ్ముంటే గెలవాల‌ని బీఆర్ఎస్ పార్టీకి స‌వాల్ విసిరారు రేవంత్ రెడ్డి. 100 మీట‌ర్ల తో స‌మాధి త‌వ్వి బీఆర్ఎస్ ను పాత‌రేస్తాన‌ని హెచ్చ‌రించారు. త‌న‌తో పెట్టుకున్న వారు ఎవ‌రూ ఇముడ లేర‌న్నారు సీఎం. జ‌న‌వ‌రి 26 త‌ర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి ప‌ర్య‌ట‌న చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. తొలి స‌భ పోరాటానికి స్పూర్తి కేంద్రం ఇంద్ర‌వెల్లి నుంచి ప్రారంభిస్తాన‌ని చెప్పారు రేవంత్ రెడ్డి.

కేసీఆర్ అనే పులి విశ్రాంతి తీసుకుంటోంద‌ని, తాము కూడా పులిని ప‌ట్టుకునేందుకు ఎముక‌లు, వ‌ల‌ల‌తో ఎదురు చూస్తున్నామ‌ని అన్నారు. ఇదే విష‌యాన్ని బీఆర్ఎస్ నేత‌లే బ‌య‌ట‌కు చెబుతున్నారంటూ ఎద్దేవా చేశారు సీఎం. మూసీ నదిని 36 నెల‌ల్లో థేమ్స్ న‌ది లాగా అభివృద్ది చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

ఇత‌ర రాష్ట్రాల‌కు భిన్నంగా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల‌లో అభివృద్ది చేస్తామ‌న్నారు. ఇచ్చిన ఆరు గ్యారెంటీల‌ను అమ‌లు చేసి తీరుతామ‌ని చెప్పారు ఎనుముల రేవంత్ రెడ్డి.