ANDHRA PRADESHNEWS

మంత్రి హామీతో విద్యార్థినుల ఆందోళ‌న విర‌మ‌ణ

Share it with your family & friends

విద్యార్థుల‌కు ర‌క్ష‌ణ‌గా మ‌హిళా పోలీస్ టీం ఏర్పాటు

విజ‌య‌వాడ – దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన కృష్ణా జిల్లా గుడ్ల‌వ‌ల్లేరు ఇంజ‌నీరింగ్ కాలేజీ విద్యార్థినుల ర‌హ‌స్య కెమెరాల చిత్రీక‌ర‌ణ ఘ‌ట‌నపై తీవ్రంగా స్పందించారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఆయ‌న వెంట‌నే మంత్రి కొల్లు ర‌వీంద్ర‌ను ఘ‌ట‌నా స్థ‌లానికి వెళ్లాల‌ని ఆదేశించారు.

గురువారం రాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం దాకా విద్యార్థినులు పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఇందుకు బాధ్యులైన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. సీఎం ఆదేశాల‌తో ఆగ‌మేఘాల మీద మంత్రి కొల్లు ర‌వీంద్ర గుడ్ల‌వ‌ల్లేరు ఇంజ‌నీరింగ్ కాలేజీ వ‌ద్ద‌కు చేరుకున్నారు.

ప‌రిస్థితి ఉద్రిక్తంగా మార‌డంతో విద్యార్థినుల‌ను న‌చ్చ చెప్పేందుకు చాలా సేపు ప్ర‌య‌త్నం చేశారు. చివ‌రి వ‌ర‌కు వారు త‌మ ఆందోళ‌న‌ను విర‌మించేందుకు ఒప్పుకోలేదు. విచార‌ణ‌కు సీఎం ఆదేశించార‌ని, పోలీసులు త‌మ ప‌ని ప్రారంభించార‌ని, ఎవ‌రూ ఆందోళ‌న‌కు గురి కావ‌ద్దంటూ హామీ ఇచ్చారు మంత్రి కొల్లు ర‌వీంద్ర‌.

విచార‌ణ పూర్త‌య్యేంత వ‌ర‌కు హాస్ట‌ల్స్ ల‌లో విద్యార్థినుల‌కు ర‌క్ష‌ణ‌గా మ‌హిళా పోలీస్ టీంల‌ను ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఘ‌ట‌నా స్థ‌లానికి మంత్రితో పాటు జిల్లా క‌లెక్ట‌ర్, ఎస్పీ అక్క‌డే ఉన్నారు. ప‌రిస్థితి అదుపు త‌ప్ప‌కుండా చూశారు. చివ‌ర‌కు కొల్లు ర‌వీంద్ర హామీతో విద్యార్థినులు ఆందోళ‌న విర‌మించేందుకు ఒప్పుకున్నారు.