మనవతా పతాక అంబేద్కర్
దేశం మరువని మహా నేత
విజయవాడ – తాడిత, పీడిత, బలహీన , పేదల వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ బాబా సాహెబ్ భీమ్ రావ్ అంబేద్కర్ అని కొనియాడారు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. భారీ ఖర్చుతో బెజవాడలో రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని నిర్మించారు. శుక్రవారం సీఎం ఆ మహా నాయకుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
అనంతరం జరిగిన భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారు. ఆ మహా నాయకుడిని చూసి ఉప్పొంగి పోయారు. దేశంలోనే ఎక్కడా లేని రీతిలో భారీ విగ్రహాన్ని నెలకొల్పడం శుభ పరిణామమని స్థానికులు పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా జగన్ మోహన్ రెడ్డి సభను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. తన చేతుల మీదుగా ఆ మహా నాయకుడి విగ్రహాన్ని ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. అంటరానితనం తన రూపం మార్చుకుందని, పేదలు చదువుకు దూరం చేయడం మంచిది కాదన్నారు సీఎం.
పేద పిల్లలు కూడా ప్రపంచంతో పోటీ పడాలన్నదే తన అభిమతమన్నారు. అందుకే నాడు నేడు కింద బడులను కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తయారు చేయడం జరిగిందని చెప్పారు జగన్ మోహన్ రెడ్డి. ప్రపంచంలోనే ఇది అతి పెద్ద విగ్రహంగా ఉండి పోతుందన్నారు.
ఇవాళ సామాజిక చైతన్యానికి కేరాఫ్ గా విజయవాడ కనిపిస్తోందన్నారు సీఎం. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అంటే అమెరికా గుర్తుకు వస్తుందని, అదే సమయంలో స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఇవాళ ఏపీ గుర్తుకు రావాల్సిందేనని చెప్పారు. ఈ విగ్రహం పేదల, రాజ్యాంగ హక్కులకు నిరంతరం స్పూర్తిగా నిలుస్తుందన్నారు. మరణం లేని మహా నాయకుడు డాక్టర్ అంబేద్కర్ అంటూ కొనియాడారు.