మరణం లేని మహా నేత ఎన్టీఆర్
కూతురు నారా భువనేశ్వరి కామెంట్
హైదరాబాద్ – మరణం అన్నది లేని మహా నాయకుడు దివంగత నందమూరి తారక రామారావు అని అన్నారు తనయ , చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి. జనవరి 18న ఎన్టీఆర్ వర్ధంతి. ఈ సందర్బంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించారు. ఆయన సమాధి వద్ద పుష్ప గుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు భువనేశ్వరి. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లుగా భావించిన గొప్ప, అరుదైన నాయకుడు దివంగత ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ కు మరణం అన్నది లేనే లేదన్నారు. ఇవాళ ఆయన భౌతికంగా లేక పోవచ్చు..కానీ ఈ లోకం ఉన్నంత దాకా బతికే ఉంటారని స్పష్టం చేశారు భువనేశ్వరి.
ప్రజలు ఇప్పటికీ ఎన్టీఆర్ ను దేవుడిగా కొలుస్తూనే ఉన్నారని అన్నారు. రాముడి రూపంలో, కృష్ణుడి రూపంలో ఎల్లప్పటికీ ఏదో ఒక రూపంలో ఎన్టీఆర్ ప్రతి ఒక్కరి హృదయాలలో చిర స్థాయిగా నిలిచే ఉంటారని తెలిపారు. ఎన్టీఆర్ స్పూర్తిగా సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు.
తెలుగు రాష్ట్రాలలో వరుసగా కొనసాగుతూనే ఉన్నాయని తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా రక్తదానం, వైద్య, విద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు నారా భువనేశ్వరి.