మరింత బాధ్యతను పెంచింది
ముప్పవరపు వెంకయ్య నాయుడు
అమరావతి – దేశంలోనే అత్యున్నతమైన రెండో పౌర పురస్కారం దక్కింది ఏపీకి చెందిన మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుకు. ఆయనతో పాటు ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవిని కూడా ఎంపిక చేసింది. ఈ సందర్బంగా వెంకయ్య నాయుడు స్పందించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
తనను ఎంపిక చేయడం పట్ల సంతోషంగా ఉందన్నారు. ఇదే సమయంలో మరింత బాధ్యతను కూడా పెంచిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తనకు ప్రకటించిన పద్మవిభూషణ్ పురస్కారాన్ని నవ భారత నిర్మాణంలో భాగస్వాములవుతున్న ప్రతి ఒక్కరికీ అంకితం చేస్తున్నట్లు మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ప్రకటించారు.
ఓ సాధారణ రైతు కుటుంబంలో పుట్టి, యువకుడిగా ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటంలో పాల్గొని ప్రజా జీవితంలో వివిధ బాధ్యతలతో గ్రామాలు, పట్టణ పేదల అభివృద్ధి కోసం కృషి చేసిన నాకు జీవితంలో ప్రతి అడుగూ సంతృప్తిని అందించిందని పేర్కొన్నారు.
ప్రతి అడుగులోనూ నా బాధ్యతను నిబద్ధుడనై, చిత్తశుద్ధితో నిర్వహిస్తూ ముందుకు సాగానని తెలిపారు. దేశంలోని గ్రామాలు, రైతులు, యువత, మహిళలు సహా నవ భారత నిర్మాణంలో భాగస్వాములు అవుతున్న ప్రతి ఒక్కరికీ నా ఈ పురస్కారాన్ని అంకితం చేస్తున్నానని చెప్పటానికి సంతోషిస్తున్నట్లు స్పష్టం చేశారు.